జనరల్‌ మహిళకే జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

జనరల్‌ మహిళకే జెడ్పీ పీఠం

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

జనరల్‌ మహిళకే జెడ్పీ పీఠం

తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఆమెకే చాన్స్‌ పీఠం కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు ప్రధాన పార్టీల నేతలతో సంప్రదింపులు జిల్లాలో 7 జెడ్పీటీసీ స్థానాల్లో జనరల్‌ మహిళలకే రిజర్వేషన్‌

ఆ అదృష్ట మహిళ ఎవరో...

సత్తెనపల్లి: కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా పరిషత్‌ తొలి జెడ్పీ పీఠం మహిళకు దక్కనుంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లలో పల్నాడు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించడంతో జెడ్పీ పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం మహిళకు లభించనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 28 మండలాలతో వేరుపడి పల్నాడు జిల్లా పరిషత్‌ కొత్తగా ఏర్పాటైంది. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మండల పరిషత్‌ కార్యాలయంలో తాత్కాలిక జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం గత నెల 25 వ తేదీన ప్రారంభించింది. సీఈవో దుర్గాప్రసాద్‌తోపాటు అధికార యంత్రాంగాన్ని నియమించింది. అయితే, స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టింది. జిల్లాలోని 28 మండలాల పరిధిలో జనరల్‌ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేశారు.

తొలిసారి అవకాశం...

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా జనరల్‌ మహిళకు అవకాశం దక్కింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే గెలుపొందారు. అప్పట్లో గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొల్లిపర జెడ్పీటీసీగా గెలుపొందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తెర హెనీ క్రిస్టినాకు అవకాశం కల్పించారు. దీంతో ఆమె ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఇటీవల వరకు సేవలందించారు. గత నెల 24వ తేదీతో జిల్లా పరిషత్‌ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగా 28 మండలాలతో పల్నాడు జిల్లా పరిషత్‌ ఆవిర్భవించింది. ఈ మండలాల్లో ఎంపీపీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా పరిషత్‌ పరిధిలో 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈసారి జిల్లా పరిషత్‌ పీఠాన్ని అధిరోహించే మహిళ పల్నాడు జిల్లా పరిషత్‌ తొలి చైర్‌పర్సన్‌గా చరిత్రకెక్కనున్నారు.

తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. జెడ్పీటీసీ రిజర్వేషన్లలో గురజాల, ఈపూరు, కారంపూడి, మాచవరం, నకరికల్లు, రొంపిచర్ల స్థానాలను జనరల్‌ మహిళలకు కేటాయించారు. ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ, కూటమి నేతలు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ అదృష్ట మహిళగా ఎవరు జెడ్పీ పీఠంపై కూర్చుంటారో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement