నేడు ‘లాటరీ’ తంతు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. మద్యం ద్వారా భారీగా ఆదాయం దండుకోవాలని భావించిన ప్రభుత్వానికి సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురవుతోంది. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. అధికార పార్టీ నేతల సిండికేట్ దందాలకు వేదికగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు తొలుత అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం గడువు విధించింది. అయితే, గుంటూరులోని 49 షాపుల్లో కేవలం 18, పల్నాడులోని 24 దుకాణాల్లో కేవలం 2 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపుకు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయడానికి వీలు ఉంటుంది. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆశించిన స్థాయిలో స్పందన కానరాకపోవడంతో గత్యంతరం లేక దరఖాస్తు గడువును అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం పొడిగించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మిగిలిపోయిన షాపులకు ఏం చేయాలో పాలుపోక ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అంతా మాయాజాలం
గతంతో పోలిస్తే ఫీజులను ఏకంగా 10 శాతం పెంచడంతో పాటు రెన్యూవల్, పర్మిట్ రూమ్‌ల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తోందని వ్యాపారులు మండిపడుతున్నారు. భారీగా లాభాలు తెచ్చిపెట్టే దుకాణాలను అధికార పార్టీ సిండికేట్ శక్తులు ఇప్పటికే రెన్యూవల్ చేసుకోగా, వ్యాపారం సరిగా సాగని, నష్టాలు వచ్చే షాపులను మాత్రం గాలికొదిలేశారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే నాన్–రీఫండబుల్ ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరేది. కానీ, అధికార పార్టీ నేతలు సిండికేట్లు కట్టి పోటీ లేకుండా చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.
సగానికి పైగా షాపులు ఖాళీ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుకాణాల స్థితిగతులను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది.
దరఖాస్తులు అందిన కొద్దిపాటి దుకాణాలకే నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. పోటీ లేకుండా అధికార పార్టీ సిండికేట్లే పథకం ప్రకారం వేసిన దరఖాస్తులకే దుకాణాలు ఖరారు కానుండటంతో ఈ లాటరీ ప్రక్రియ కేవలం నామమాత్రపు తంతుగానే మిగిలిపోనుందనే విమర్శలు వస్తున్నాయి. అటు రెండు జిల్లాల్లో కలిపి ఒక్క దరఖాస్తు కూడా రాని 31 షాపుల (గుంటూరులో 19, పల్నాడులో 12) పరిస్థితి ఏమిటన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మిగిలిపోయిన షాపులకు ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తారనే దానికి అధికారుల నుంచి స్పష్టత లేకుండా పోయింది. మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు సాగుతున్న ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.


