అమరావతి: అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉపప్రధాన అర్చకుడు కై తేపల్లి సుధీర్‌శర్మ మాట్లాడుతూ బాలచాముండేశ్వరిని 11న బాలత్రిపురసుందరిగా అలంకరించనున్నారు. 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణాదేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపుర సుందరీదేవి, 16న సరస్వతీదేవి, 17న మహాలక్ష్మీదేవి, 18న దుర్గాదేవి, 19న మహిషాసుర మర్దని, 20న రాజరాజేశ్వరిగా అలంకారం చేయనున్నట్లు వివరించారు. అలాగే దసరా నవరాత్రులు సందర్భంగా అక్టోబరు 10వ తేదీ స్వామి వారికి చండీ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. 11వ తేదీ రాత్రి ఆరు గంటలకు పారువేట, ఎనిమిది గంటలకు శమీపూజ నిర్వహించనున్నట్లు చెప్పారు.
అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం, ఏపీ ఆధ్వర్యంలో దూరవిద్య విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త, జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారు, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్‌లో సైన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీఎల్‌ఐఎస్సీ కోర్సులో ప్రవేశం పొందుటకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. వివరాలకు 73829 29605 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బీఆర్‌ఏఓయూఏపీ.ఏసీ.ఇన్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసిన అనంతరం ఆన్‌లైన్‌లోనే నిర్ణీత అడ్మిషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ సందర్శన
రేపల్లె: రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలోని ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను సొసైటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వై.డి.రామారావు బుధవారం సందర్శించారు. రక్త సేకరణను పెంచడంతో పాటు యూనిట్ల జారీ సంఖ్యను కూడా పెంచేలా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రేపల్లె రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ వీర రాఘవయ్య, వైస్ చైర్మన్ మద్రాస్ సాంబశివరావు, సభ్యులు సుగ్గుల సుదర్శనరావు, డాక్టర్ లీలా కృష్ణకుమారి, డాక్టర్ రమాదేవి, లక్ష్మీనరసమ్మ, కరిముల్లా, శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టాకు 2,720 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 2,720 క్యూసెక్కులు బుధవారం విడుదల చేశారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్ చానల్‌కు 126 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 579, తూర్పు కాలువకు 408, పశ్చిమ కాలువకు 111, నిజాంపట్నం కాలువకు 303, కొమ్మమూరు కాలువకు 800 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ నాయకుల బైండోవర్
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ నాయకులను బుధవారం పట్టణ పోలీసులు బైండోవర్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ నాయకులు, నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రశ్నిస్తూ సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పథకాలను వీడియోల ద్వారా ప్రశ్నించిన సుమారు 10 మందిని పోలీసులు బైండోవర్ చేశారు.


