అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

అనర్హుల పేర్ల తొలగింపునకు చర్యలు నేటి నుంచి తొలగించిన పేర్లపై బీఎల్‌ఓల ఇంటింటి పునఃపరిశీలన ఈ నెల 16న తుది ఓటర్ల జాబితా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా జూన్‌ 15 నుంచి జూలై 24 వరకు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటి సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా పొరపాటున తొలగిపోకుండా ఉండేందుకు ప్రత్యేక పునఃపరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం నుంచి బీఎల్‌ఓలు తమ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో తొలగించిన వారి పేర్లతో ఇంటింటికీ వెళ్లి పునఃపరిశీలన నిర్వహిస్తారని చెప్పారు. పొరపాటున తొలగించినట్లు గుర్తిస్తే ఫారం–6 పూర్తి చేయించిజాబితాలో పేరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అక్టోబర్‌ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. తుది జాబితాలో పేరు లేని అర్హులైన వారు, అలాగే జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 అర్హత తేదీల ప్రకారం కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకునే వారు నిరంతర ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియలో భాగంగా ఫారం–6 సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జగదీశ్‌ అదహళ్లితో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పరిషత్‌ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన సంఖ్యలో బ్యాలెట్‌ బాక్సులను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని తగిన సంఖ్యలో పోలింగ్‌ సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందిని కూడా ముందుగానే ఎంపిక చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఈసీ–ఈఎంఎస్‌ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ జగదీశ్‌ అదహళ్లి, జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగేశ్వరనాయక్‌, ఆర్డీఓలు, డీఎస్పీలు, డీఎల్‌డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, పలు శాఖల ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement