నరసరావుపేట: హిందూ పురాణాల ప్రకారం సృష్టిలోని అద్భుతమైన నగరాలు, దేవతల దివ్య ఆయుధాలు రూపొందించిన మహా ఇంజినీర్, దైవ వడ్రంగి విశ్వకర్మ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. లోకశిల్పి, దైవిక వాస్తుశిల్పి అయిన భగవాన్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో వారి చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ రంజిత్ కుమార్ చౌదరి, డీఆర్‌ఓ కె.అద్దెయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావులతో కలసి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకతకు, సాంకేతిక నైపుణ్యానికి, కఠిన శ్రమకు నిలువెత్తు రూపం విశ్వకర్మ అని పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 రకాల కులవృత్తుల వారిని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వ్యాపారాభివృద్ధికి తక్కువ వడ్డీతో రూ.3లక్షల వరకు రుణ సదుపాయం అందించడం జరుగుతుందన్నారు. అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు, పాత పరికరాల స్థానంలో ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.15వేల విలువైన ఈ–వోచర్ అందించడం జరుగుతుందన్నారు. బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకంలో ప్రధానంగా 18 వృత్తులు ఉన్నాయని అందులో మూడు సాంప్రదాయ వృత్తులన్నారు. శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వృత్తిలో నైపుణ్యం పెంపొందించేందుకు నైపుణ్య కేంద్రాలు ఉన్నాయని, వాటిలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారన్నారు. కానీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, లోన్లు ఇప్పిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీసీ నాయకులు పాల్గొన్నారు.
ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ


