జాయింట్ కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: అనధికార లేఅవుట్లలో ప్లాటు కొనుగోలు చేసి నష్టపోవద్దని జిల్లా ప్రజలకు జాయింట్ కలెక్టర్ సంజనా సింహా విజ్ఞప్తి చేశారు. అలాగే అనుమతులు లేకుండా వెలుస్తున్న అనాధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీర్చుకుంటామని హెచ్చరించారు. స్థానిక అరండల్‌పేటలోని పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ (పౌడా) కార్యాలయంలో అనధికార లేఅవుట్లపై జేసీ గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఆర్థిక నష్టం తప్పదన్నారు. వెంచర్ల వద్ద వేసే ఆకర్షణనీయమైన ప్రకటనలు చూసి నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ప్లాటు కొనుగోలు చేసే ముందు సదరు లేఅవుట్లకు సంబంధించిన సంస్థల ఆమోదం ఉందో లేదో సరిచూసు కోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము గుర్తించిన అనధికారిక లేఅవుట్ల వివరాలను విలేకర్లకు అందజేశారు.
దాచేపల్లి: నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని కేసానుపల్లి రైల్వే గేటుకు కూతవేటు దూరంలో గురువారం రాత్రి పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిచింది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చైన్ లాగడంతో కేసానుపల్లి రైల్వే గేటు దాటిన తర్వాత రైలు నిలిచింది. అప్రమత్తమెన లోకో పైలట్లు, గార్డ్ చైన్ లాగిన బోగీ వద్దకు చేరుకున్నారు. చైన్ లాకింగ్ సిస్టం విడుదల చేసిన తర్వాత రైలు అక్కడి నుంచి పిడుగురాళ్ల వైపు కదిలింది. సుమారుగా 20 నుంచి 25 నిమిషాల పాటు రైలు ఆగినట్లుగా ప్రయాణికులు తెలిపారు. చైన్ లాగిన వ్యక్తికి మతిస్థిమితం లేదని గుర్తించినట్లు తెలిసింది. పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో వెనుక వచ్చిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని నడికుడి రైల్వేస్టేషన్‌లో సుమారుగా 15 నిమిషాల పాటు అధికారులు నిలిపివేశారు.


