చిలకలూరిపేట: అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ పథకం ప్రభుత్వం విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లింగంగుంట్ల గ్రామానికి శనివారం రానున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం 12.50 నుంచి 1.20 వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. 2.15 నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని, సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల గ్రామం నుంచి బయలు దేరి వెళతారని వివరించారు.
యడ్లపాడు: ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు ఆచరించటం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్‌మెంట్ సెంటర్ ప్రతినిధులు ఉషారాణి, శ్వేతబెనర్జీ, అభిషేక్ సింగ్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతు మానం శ్రీకాంత్, మహిళా రైతు గల్లా మల్లేశ్వరి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ మునగ పంటలో దొండ, గోంగూర, తోటకూర, క్యారెట్ వంటి అంతర పంటలు సాగు చేయటం ద్వారా ప్రధాన పంటల ఖర్చు తగ్గటమే కాక చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబం ఈ విధానాన్ని అనుసరిస్తే వలసలు అవసరం లేకుండా జీవనోపాధి భద్రత లభిస్తుందన్నారు. అనంతరం గ్రామ సంఘ సమాఖ్య సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాలని, అవసరమైన వనరులను గ్రామ సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సంఘసభ్యులు వినియోగించుకుని మిగిలిన ఉత్పత్తులు సమష్టిగా మార్కెటింగ్ చేసుకోవాలని అమలకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్‌రాజ్, జిల్లా సిబ్బంది అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 516.20 అడుగులకు చేరింది. ఇది 142.4378 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి నీటి చేరిక నిలిచిపోయింది.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్‌లో జరుగుతున్న నాన్–ఇంటర్‌లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం –ఖరగ్‌పూర్ (22604), 24న తిరునెల్వేలి –పురూలియా (22606), 25న టాటానగర్ –యర్నాకులం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు.


