దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి శుక్రవారం రాత్రి ఘనస్వాగతం పలికారు. ఓ కేసులో అరెస్టు అయ్యి బెయిల్‌పై విడుదలైన బ్రహ్మనాయుడు హైదరాబాద్ నుంచి వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి దాచేపల్లి చేరుకున్నారు. బ్రహ్మనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ప్రతి ఒక్కరిని బ్రహ్మనాయుడు అప్యాయంగా పలకరించారు. స్వాగతం పలికిన వారిలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి షేక్ జాకీర్‌హుస్సేన్, నాయకులు కొప్పుల రవికుమార్, బొమ్మిరెడ్డి నరసింహారావు, సంకురాత్రి వీరయ్య, ముళ్లపాటి నరసింహారావు, బొమ్మిరెడ్డి నాగరాజు, మునగా శ్రీనివాసరావు, కొమ్ము బుజ్జి, కొమ్మా కరుణాకర్, షేక్ సైదా, గాదె రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.
బొల్లా విడుదలపై సంబరాలు
వినుకొండ: వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంపై నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరైన సమాచారం తెలియగానే వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని జాలలపాలెం గ్రామంలో పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
సత్యమే జయించింది
స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడుపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేశారని, న్యాయస్థానంపై తమకున్న నమ్మకం నిజమైందని పేర్కొన్నారు. న్యాయమే గెలిచిందంటూ పరస్పరం సీట్లు తినిపించుకొని అభినందనలు తెలుపుకున్నారు. సంబరాల్లో నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
బొల్లా గిరిబాబు హర్షం
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుమారుడు, యువ నాయకుడు బొల్లా గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు. గిరిబాబు మాట్లాడుతూ 14 రోజులుగా వినుకొండ నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మనాయుడు విడుదల కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేసుకున్నారు. అందరి ఆశీస్సులు, ప్రార్థనలు, దేవుని కృపతోనే బెయిల్ లభించిందని తెలిపారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలందరికి బొల్లా గిరిబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


