● కారు బోల్తా పడి ఇద్దరు మృతి
● మరో నలుగురికి గాయాలు
దాచేపల్లి: అతివేగం రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు మృతి చెందారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో చింతల పుష్పలత(34), నారదాసు రమణమూర్తి (54) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ తన భార్య పుష్పలత ఇద్దరు పిల్లలతో హైదరాబాదు నుంచి సత్తెనపల్లికి కారులో వస్తున్నారు. పుష్పలత పుట్టిల్లు సత్తెనపల్లి. గామాలపాడు సమీపంలోకి రాగానే అతివేగం కారణంగా రాజశేఖర్ నడుపుతున్న కారు అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై అదుపు తప్పింది. డివైడర్‌ని ఢీకొట్టి గుంటూరు వైపు నుంచి మేడ్చల్ వెళుతున్న మరో కారుపై పడింది. ఘటనలో పుష్పలత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మరో కారులో ఉన్న నారదాసు రమణమూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా రమణమూర్తి మృతి చెందాడు. రాజశేఖర్, అతని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. మరో కారులోని నలుగురూ గాయపడ్డారు. ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న దాచేపల్లి సీఐ ఎం.రాజేష్, ఎస్‌ఐ జి.పాపారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
పుష్పలత, రమణమూర్తి మృతదేహాలు


