సత్తెనపల్లి: గుంటూరు–బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ సత్తెనపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి సేకరించే భూమిని గజాల ప్రకారం గుర్తించాలని రైతులు కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగముగా సత్తెనపల్లి మండల పరిధిలోని రైతులతో అవార్డు ఎంక్వయిరీ సమావేశం కంపిటెంట్ అథారిటీ(భూసేకరణ) – రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. భూసేకరణలో భాగమైన అబ్బూరు, గుడిపూడి, భీమవరం, కంకణాలపల్లి, సత్తెనపల్లి, ధూళిపాళ్ల గ్రామాల పరిధిలోని నోటిఫైడ్ రైతులు హజరై తమ భూమికి సంబంధించిన హక్కు పత్రములను అందించారు. రైతులు మాట్లాడుతూ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో భూమి గజాలలో ఉన్నందున గజాలలోనే లెక్కించి పరిహరం అందించాలన్నారు. అలా కాకుండా సెంట్లలో లెక్కిస్తే పరిహరం తక్కువ వస్తుందన్నారు. అంతేగాక చిన్న రైతులు 5 సెంట్లు ఉంటే కేవంల 3 సెంట్లు మాత్రమే తీసుకోవడం వల్లన మిగిలిన రెండు సెంట్లలో ఏ పనులు చేసుకోవటానికి అనువుగా ఉండదని, ఆ భూమికి దారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. భూసేకరణ అధికారులు ఈ అవార్డ్ ఎంక్వయిరీకి హాజరైన రైతులం దరికీ పరిహారమునకు గురించిన పూర్తి సమాచారంను వివరించారు. సత్తెనపల్లి మండ ల పరిధిలోని గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగమైన వివిధ గ్రామాలలోని భూ విస్తీర్ణం వివరములు ఇలా ఉన్నాయి...అబ్బూరు ఎ.0.375 సెంట్లు, గుడిపూడి ఎ.0.610 సెంట్లు, భీమవరం ఎ 0.871 సెంట్లు, కంకణాలపల్లి ఎ.5.595 సెంట్లు, సత్తెనపల్లి ఎ.7.310 సెంట్లు, ధూళిపాళ్ల ఎ.11.960 సెంట్లుగా తేల్చారు. ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 193 మంది రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆర్డీఓ కార్యాలయ ఏవీపీ చంద్రారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ నేలటూరి రవికుమార్, ఆర్‌ఐ భోస్‌బాబు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు.
భూ సేకరణ సమావేశంలో రైతులు డిమాండ్


