నరసరావుపేట: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.2500 నుంచి రూ.3వేలకు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెనూ బాగా పెంచామని హంగులు ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఏ మాత్రం కూడా పెంచలేదని అన్నారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు రూ.1200, ఇంటర్మీడియట్‌కు నెలకు రూ.1600లు బడ్జెట్ కేటాయిస్తే 30 రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు, హేమంత్, యశ్వంత్, మధు ,హర్ష, చరణ్ పాల్గొన్నారు.


