బాపట్లటౌన్: బీచ్ షాక్ పేరుతో తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలు తప్పవని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగయ్య తెలిపారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గంగయ్య మాట్లాడుతూ బాపట్లకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్‌లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.97 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, దీనిని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే గోవా తరహాలో సూర్యలంక బీచ్‌ని అభివృద్ధి చేయాలని బీచ్ షాక్ పేరుతో సూర్యలంకలో రెండు వైన్ షాపులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుండి అహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి కుటుంబ సభ్యులతో వేల సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని, ఇక్కడ బార్ షాపులు ఓపెన్ చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐద్వా కార్యదర్శి సుభాషిణి, పార్టీ బాపట్ల నాయకులు కె.శరత్ పాల్గొన్నారు.


