కేసుల కారణంగా వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కేసుల కారణంగా వ్యక్తి ఆత్మహత్య

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

కేసుల కారణంగా వ్యక్తి ఆత్మహత్య

నకరికల్లు: ఓ కేసు విషయమై మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో బుధవారం జరిగింది. మృతుని భార్య తిరుపతమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు... నకరికల్లులోని ఎస్టీ కాలనీలో కేసరి సూర్యనారాయణరెడ్డి(62) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటిపక్కనే ఉన్న కొణతం తిరుపతమ్మ, భర్త కొండారెడ్డిలకు మధ్య నీటిపంపు విషయమై రెండేళ్ల క్రితం వివాదం జరిగింది. అప్పట్లో సూర్యనారాయణరెడ్డిపై తిరుపతమ్మ కేసు పెట్టగా.. ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. కాగా సూర్యనారాయణరెడ్డి మద్యం తాగి తిడుతున్నాడంటూ నకరికల్లుకు చెందిన డీకొండ మహానంది అనే వ్యక్తి తిరుపతమ్మ వాళ్లను రెచ్చగొట్టి ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. ఇదే విషయమై పోలీసులు నాలుగురోజుల పాటు స్టేషన్‌కు పిలిపించారన్నారు. బుధవారం ఉదయం కేసు విషయమై మాట్లాడేందుకు రమ్మని పెద్దలు తిరుపతమ్మ వాళ్లకు ఫోన్‌ చేయగా రేపు వస్తామన్నట్లు పెద్దమనుషులు తెలిపారన్నారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్తున్నానని భార్యతో చెప్పిన సూర్యనారాయణరెడ్డి ఇంటి నుంచి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో ఆమె పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేయగా రాలేదని తెలిపారు. బంధువుల సహాయంతో వెతకగా గ్రామ శివారులోని చల్లగుండ్ల పొలాల్లో సూర్యనారాయణరెడ్డి విగతజీవిగా పడి ఉండడం గుర్తించారు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. కేసులతో వేధిస్తున్న కారణంగానే మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యనారాయణరెడ్డికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహమైంది. ఎస్‌ఐ కె.సతీష్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement