నరసరావుపేట రూరల్: యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రమైన కోటప్పకొండలో యోగాంధ్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజనా సింహ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మికతల కలయికే యోగా అని తెలిపారు. అవగాహన కల్పించేందుకు 21 రోజులపాటు వివిధ దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన వారు, మహిళలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో తప్పనిసరి అని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతోపాటు బీపీ, షుగర్ వంటి రోగాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
యోగా ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్ పెంచండి
జిల్లాలో యోగా ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్లు మరింత పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల పురోగతిపై క్షేత్రాధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యోగా ట్రైనర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 19న అమరావతిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


