ఐదు పాఠశాల బస్సులు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదు పాఠశాల బస్సులు సీజ్‌

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

ఐదు పాఠశాల బస్సులు సీజ్‌ పికిల్‌ బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ బాక్సింగ్‌ జాతీయ పోటీలకు కార్తికేయ ఎంపిక సాగర్‌ నీటిమట్టం

నరసరావుపేట రూరల్‌: ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా నడుపుతున్న ఐదు పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. రవాణా కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాల బస్సులలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆరు బృందాలు పాల్గొని పాఠశాల బస్సులను తనిఖీ చేశాయి. జిల్లా రవాణాధికారి జి.సంజీవ కుమార్‌ మాట్లాడుతూ చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పన్ను చెల్లింపు రసీదులు, పర్మిట్లు లేకుండా పాఠశాల బస్సులను నడపవద్దని హెచ్చరించారు. పది రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల వాహనాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 2వ దక్షిణాది రాష్ట్రాల పికిల్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరు క్రీడాకారులు ఎనిమిది బంగారు, ఆరు రజత, ఆరు కాంస్య పతకాలు సాధించారు. మొత్తం 20 మెడల్స్‌ సాధించారని జిల్లా పికిల్‌ బాల్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. పోటీల్లో తోట నిహిత మన్వి, అనపర్తి ఆరాధ్య, తోట నేహ, విన్సెంట్‌, చరణ్‌, కె. నిహాల్‌, రిషి మెడల్స్‌ సాధించారన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను పలువురు అభినందించారు.

వేద సీడ్స్‌ ఆర్థిక సాయం

కొరిటెపాడు(గుంటూరు): జూనియర్‌ బాల బాలికల జాతీయ బాక్సింగ్‌ పోటీలకు 70 కిలోల విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన కార్తికేయ ఎంపికైనట్లు గుంటూరు జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, వేద సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసి ధర్మ చరణ్‌ తెలిపారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అసోసియేషన్‌ సభ్యులతో కలసి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో కార్తికేయ బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో ఈ పోటీలు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కార్తికేయకు వేద సీడ్స్‌ తరఫున సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.చంద్రశేఖర్‌ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ పోటీలలో కూడా కార్తికేయ రాణించి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచిన కార్తికేయను అభినందించారు. కార్యక్రమంలో బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ కోలా చిరంజీవి, గంధం వెంకటేశ్వరావు, ఎం.రాజేశ్వరరావు, కోచ్‌ ఇమ్మానియేల్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.80 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement