లక్ష్మీపురం: జూలై 1 నుంచి అమలులోకి రానున్న వీబీపీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. మంగళవారం గుంటూరులోని సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లతోందన్నారు. గ్రామాల్లో ఫేస్ యాప్ వలన ఉపాధి కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికి మస్టర్ వేసే దాంట్లో భాగంగా ఫొటో మ్యాచ్ అయితేనే పని చూపుతున్నారని, ఇది కూడా పని ప్రారంభంలో ఒకసారి పని పూర్తయిన తర్వాత రెండవసారి ఫొటో తీస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్వర్ పనిచేయక ఫొటో మ్యాచ్ కాక ఉపాధి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కార్మికులకు పని చేసిన 15 రోజుల్లోపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వేతనం ఇచ్చేటప్పుడు పే ిస్లిప్పులు ఇచ్చే వారిని, దానిలో ఎంత పని చేసింది ఎంత డబ్బులు పడుతుంది వివరంగా అర్థమయ్యేదన్నారు. ప్రస్తుతం ఎక్కడా ప్లే స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ చట్టం ప్రకారం వంద రోజులు పనిని కల్పించాలని కోరారు. జూలై ఒకటిన గ్రామ సచివాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.


