విజయోత్సవ సభలో కనిపించని జనసేన నియోజకవర్గ సమన్వయకర్తలు
పిలుపు రాకపోవడమే ప్రధాన కారణం అంటున్న జనసైనికులు
వెన్నుపోటు పార్టీగా టీడీపీ మరోసారి నిరూపణ
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తామే ప్రధాన కారణమని భావిస్తున్న జనసేన శ్రేణులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఝలక్ ఇచ్చారు. వెన్నుపోటు పార్టీగా ముద్ర వేసుకున్న టీడీపీ నేతలు మరోసారి జనసేనకు తామేందో రుచిచూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సోమవారం కూటమి నాయకులు విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహించారు. అయితే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన పార్టీ సమన్వయకర్తలు ర్యాలీలోగాని, సభకు గానీ హాజరు కాకపోవటం చర్చనీయాంశమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమంది కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్తలు రాకపోవడానికి ప్రధాన కారణం పిలుపు లేకపోవటమేనని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించామని భావిస్తున్న జనసేన శ్రేణులకు ఇది వెన్నుపోటుగానే భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రాత్రనకా పగలనకా కష్టపడిన జన సైనికులు విజయోత్సవ సభకు తమ నాయకులకు పిలుపునివ్వకపోవటంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వచ్చిన అనేకమంది నాయకులు తమకు ఎటువంటి పిలుపులేదని వాపోయినట్లుగా తెలియవచ్చింది. ఇది కూటమి ధర్మాన్ని నిర్వీర్యం చేయడమేనని జనసైనికులు భావిస్తున్నారు. రెండేళ్లు కూటమి ప్రభుత్వంలో భాగమైన తమకు సభకు ఆహ్వానం అందించకపోవడం అవమానించడమేనని వారు భావిస్తున్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం..
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు సమీపంలోని పెరేడ్ గ్రౌండ్‌లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం‘ జిల్లా స్థాయి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతిని సూచిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పల్నాడు ప్రాంతంలో రెండు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్‌గా మార్చడమే కాకుండా, కొత్త కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ వేడుకలకు హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులతో కలిసి రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టం, వ్యవసాయ పరికరాలు, అలాగే డి.ఆర్.డి.ఎ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీ ఆటోలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సాధించిన ప్రగతిని వివరించారు. పల్నాడు జిల్లా ప్రగతి పథంలో మరింత వేగవంతంగా ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.


