ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రబీ పంటలను కాపాడేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు నిరంతరాయంగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఎస్‌పీ సూపరింటెండెంట్ ఇంజినీరు కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కొడాలి ఏడుకొండలుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర పంటలను ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు అప్పులు చేసి సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే కీలక దశలో సాగునీరు అందించకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం, రైతులు అప్పులపాలవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం నష్టాల బాటలో ఉన్న వేళ, సాగునీటి విధానంలో పాలకుల అవగాహన రాహిత్యం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారుతుందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సాగునీరు ఇవ్వడంలో విఫలమవుతుందని ఆరోపించారు. కాలువల ఆధునీకరణ లోపం, సిబ్బంది కొరత కారణంగా సాగునీరు వృధా అవుతుందన్నారు. సరైన నిర్వహణతో చివరి భూములకు నీరు అందించవచ్చన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.


