పెరిగిన వంటనూనె, పప్పుదినుసుల ధరలు
సలసల కాగుతున్న వంట నూనెలు
రెస్టారెంట్లు, హోటళ్లలోనూ అదనపు మోత
జిల్లాలో కొనసాగుతున్న ‘గ్యాస్’ ఇబ్బందులు
చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్
పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల
గ్యాస్ మంట ఇలా...
గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ. 860
బ్లాక్‌లో రూ. 2,500 వరకూ విక్రయిస్తున్నారు
కమర్షియల్ సిలిండర్ గతంలో రూ. 1,816
రకం పాత ధర కొత్త ధర
కందిపప్పు 100 130
పెసరపప్పు 100 120
మినపగుళ్లు 105 120
శనగపప్పు 80 100
వేరుశనగలు 120 170
రకం పాత ధర కొత్తధర
పామాయిల్ 110 130
రిఫైండ్ ఆయిల్ 155 185
డబ్బా ధర
పామాయిల్ 2,000 2,300
రిఫైండ్ ఆయిల్ 2,500 2,900
సత్తెనపల్లి: పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ యుద్ధమేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు నిత్యావసర ధరలు పెరగడం.. మరోవైపు గ్యాస్ కొరతతో జిల్లా ప్రజలు అవస్ధలు పడుతున్నారు. వంట నూనె నుంచి పప్పు దినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంట నూనె రేట్లు పెరగడంతో రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్‌కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటనే ప్రశ్నిస్తున్నారు. పెరిగిన రేట్లతో జేబులుకు చిల్లులు పడుతున్నాయని వాపోతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. గ్యాస్ రేట్లు పెరగడంతో కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి.
ధరల మంటకు కారణాలు ఇవే..
గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యావసర వస్తువులు, వంటనూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్‌లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
కృత్రిమ కొరతతో నిలువు దోపిడీ..
అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి కొందరు వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు పాత స్టాక్‌ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్‌ను సైతం పెరిగిన ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదునుగా రిటైల్ వ్యాపారులు కిరాణా వస్తువుల ధరలను కూడా పెంచారు.
జిల్లాపై మరింత భారం...
జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 10 వేల లీటర్ల వరకు వినియోగం జరుగుతున్నట్లు అంచనా. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామ్ ఆయిల్ లీటరుకు రూ. 20, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్‌కు రూ. 30 వరకు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ధరల నియంత్రణకు, సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం రూ. 860+ రూ. 60 (పెరిగిన రేట్)
ప్రస్తుతం (రూ.1816+రూ.114)= రూ.1,930
బ్లాక్‌లో కమర్షియల్ లేవంటున్నారు. ఉంటే
రూ. 3,200 వరకూ విక్రయిస్తున్నారు.


