ఆర్థిక వనరులపై దాడులతోనే ఎమ్మెల్యే ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక వనరులపై దాడులతోనే ఎమ్మెల్యే ఆందోళన

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

ఎమ్మెల్యే అరవిందబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి ఐజీ స్థాయి వ్యక్తి వచ్చినా బాత్రూమ్‌లో దాక్కోవటం దారుణం ఐజీ ఆఫీసులో బాత్రూమ్‌, ఆఫీసు డోర్‌ పగులకొట్టడం శోచనీయం ప్రతిపక్షంపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: తనకు ఆర్థిక వనరులు కల్పిస్తున్న గంజాయి, పేకాటలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్‌పీపై కోపంతో పది గంటలపాటు బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుపై వెంటనే కేసు నమోదుచేసి అరెస్టుచేసి జైలుకు పంపించాలని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ అమలు కర్తలైన సాక్షాత్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన విధుల్ని అడ్డుకొని బైఠాయించి హల్చల్‌ చేసిన ఎమ్మెల్యేపై ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక చిన్న కానిస్టేబుల్‌ విధులు అడ్డుకుంటే వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై కనీసం నాలుగు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారన్నారు. అటువంటిది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్‌పీ విధులకు ఆటంకం కలిగించినా చర్యలు లేకపోవచం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు రెడ్‌బుక్‌ రాజ్యాంగం, అధికార పార్టీకి మరో రాజ్యాంగం అమలవుతోందన్నారు. బైఠాయించిన ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ఐజీ స్థాయి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ పెద్దలు వచ్చినా కలవకుండా బాత్రూంలో దాక్కోవటం చిన్నపిల్లల చేష్టలను తెలియజేస్తుందన్నారు. ఇతని వ్యవహార శైలి, ప్రవర్తనలో తేడాగా కనిపిస్తుందన్నారు. బాత్రూమ్‌ డోర్‌, ఆఫీస్‌ డోర్‌ పగలగొట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆర్‌డీఓ కార్యాలయానికి గేదెలు కాసుకునే యువకుడిని తీసుకువెళ్లి సాయంత్రం నాలుగు గంటల లోపు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. అతని క్వాలిఫికేషన్‌, అర్హత ఏమిటో తెలియకుండా ఎలా ఉద్యోగం ఇస్తామని, రూల్స్‌ ప్రకారం కలెక్టర్‌కు పంపిస్తానని ఆర్‌డీఓ చెప్పినా మొండిపట్టు పట్టడం జరిగిందన్నారు. ఇతని ప్రవర్తన దారుణంగా ఉంటుందని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అసలు కారణం వేరే...

ఎస్‌పీ కార్యాలయంలో ఒక లీగల్‌ అడ్వైజర్‌ పోస్ట్‌ కోసం ఈ గొడవ అంతా చేసినట్టు చెబుతున్నాడని, అయితే వాస్తవానికి ఎస్పీ పల్నాడు జిల్లా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కడ పేకాట, గంజాయి అమ్మకాలు జరగనివ్వకుండా అడ్డుకోవటం చేస్తున్నాడనే కోపంతోనే ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తించారన్నారు. కార్యాలయంలో ధర్నా చేసి ఎస్పీని బ్లాక్‌ మెయిల్‌ చేయడం, బాత్రూం డోర్లు వేసుకొని తీవ్రమైన సమస్యలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇది చిన్న కేసు కాదని భారత రాజ్యాంగ అమలుకర్తలైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఈ రకమైన అవమానం జరగటం ఘోరమైన విషయమని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ సంఘాల పెద్దలు బయటికి రావాలని, ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవరూ భయపడవద్దని, ఈ సంఘటనపై ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ చెప్పేవన్నీ సూక్తులు–చేసేవన్నీ దౌర్భాగ్యపు పనులని అన్నారు. టీడీపీ ఎంపీ పుట్ట సుధాకర్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకొని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడితే అతని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పార్లమెంటుకు పంపించిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తనను మోసగించినట్లు ఓ మహిళ మొత్తుకుంటున్నా ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. అతను యథావిధిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు. తమ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్‌లోను, రోడ్డుపై ఏదైనా మాట్లాడితే వారిపై ఒకటికి నాలుగు కేసులు పెడుతూ ద్వంద్వ నీతిని అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement