లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్‌లో 70వ రైల్వే వీక్ అవార్డులు 14 మందికి రావడం అభినందనీయం అని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం 70వ రైల్వే వీక్ అవార్డులను డీఆర్‌ఎం ప్రదానం చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలలో అవార్డులు అందుకున్న వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ అడ్మిషన్ల బ్రోచర్ విడుదల
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల అడ్మిషన్స్ బ్రోచర్‌ను వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య పి. బ్రహ్మాజీరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కోర్సులను విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని పేర్కొన్నారు. సైన్స్ విభాగంలో 25, ఆర్ట్స్ విభాగంలో 33 పీజీ కోర్సులతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషనను ఎంపీడీ, ఎంఎస్సీ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వంటి ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా యూజీ స్థాయిలో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు, పలు డిప్లమా ప్రోగ్రాములు కూడా అందిస్తున్నామన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.


