● అసలు జరిగిందేంటంటే.. విజయపురిసౌత్ క్యాంప్ కాలనీలో ఉన్న బీ2, సీ, డీ, ఈ, ఈ1, ఎండీ, హెచ్‌సీ, పీసీ టైపు ప్రభుత్వ గృహాలను 2004లో నిర్ణయించిన ధరకు స్థానిక నివాసితులకు అప్పగించారు. ఈ గృహాలలో ఉన్న వారికి క్యాంప్ అండ్ బిల్డింగ్స్ సెక్షన్ నుంచి విద్యుత్ మీటర్లను సొంత ఖర్చులతో బిగించుకోవాలని నోటీసులు అందించారు. 2016లో కాలనీలో గృహాలకు విద్యుత్‌మీటర్ల అమర్చారు. అప్పట్లో కొంతకాలం విద్యుత్ బిల్లులు సీఅండ్‌బీ అధికారులు వసూలు చేశారు. తరువాత సిబ్బంది కొరతతో బిల్లులు వసూలు చేయలేదు. ఎన్‌ఎస్‌పీ అధికారులు విద్యుత్ బిల్లులు వినియోగదారుల నుంచి వసూలు చేయలేకపోవటంతోనే విద్యుత్ శాఖకు బకాయి భారీగా పేరుకుపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు విద్యుత్ శాఖ అధికారులు వేళాపాళా లేకుండా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో చిన్నారులతో పాటు వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవటంతో కాలనీకి నీటి సరఫరా చేసే ఫిల్టర్‌హౌస్‌లో కృష్ణానది నుంచి పంపింగ్ జరగటంలేదు. దీంతో కాలనీలో సరిగ్గా నీటి సరఫరా జరగటం లేదు.
● సాగర్, నాగార్జునకొండకు వచ్చే పర్యాటకులు సైతం విద్యుత్, నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తయారయ్యే సాగర్ ప్రాజెక్టులో పవర్‌కట్ ఏంటా అని పర్యాటకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేసి గృహాలలో మీటర్లు బిగించి ప్రజల సమస్యను తక్షణమే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు, స్థానికులు
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో అంతర్భాగమైన విజయపురిసౌత్ క్యాంపు కాలనీ 2వేల గృహాలు, 10వేల జనాభాతో పాటు నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇటువంటి పర్యాటక ప్రాంతంలో గత మూడు రోజులుగా ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు పవర్‌కట్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయపురిసౌత్ క్యాంపు కాలనీ వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో జలవనరుల శాఖ ఏపీఎస్‌పీడీసీఎల్‌కు సుమారు రూ.35 కోట్ల బకాయి పడింది. దీంతో మాచర్ల విద్యుత్ శాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పవర్‌కట్ చేస్తున్నారు.