‘ఉపాధి’లో కాసుల పంట
ప్రైవేటు ఉపాధ్యాయుల పేరుతో మస్టర్‌లు
రైతుల సంతకాలు, ఫొటోలు లేకుండానే పంట కాలువ పనులకు బిల్లులు
మట్టి పనుల కొలతల్లో భారీ తేడాలు
చేయని పనులకు చేసినట్లుగా చెల్లింపులు
ఒకే పనికి వేర్వేరు గుర్తింపు సంఖ్యలు
నిధుల దుర్వినియోగంపై విచారణ, శాఖాపరమైన చర్యలకు
సిద్ధమవుతున్న అధికారులు
ప్రజలు లేకుండానే ప్రజావేదిక
ఖాళీగా ఉన్న కుర్చీలు
నకరికల్లు:తప్పుల మీద తప్పులుచేస్తున్నారు... స్పృహలో ఉండి చేస్తున్నారా.. లేక ఎవరూ కనిపెట్టలేరని చేస్తున్నారా... ఉపాధి లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారంటూ డ్వామా పీడీ ఎం.సిద్ద లింగమూర్తి ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. నకరికల్లులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.7.28 కోట్ల విలువైన ఉపాధి పనులపై నెలరోజులపాటు సామాజిక తనిఖీ చేపట్టి గుర్తించి అంశాలపై ప్రజావేదిక నిర్వహించారు.
తనిఖీల్లో గుర్తించిన అంశాలివే..
సామాజిక తనిఖీ బృందాలు తన తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కుంకలగుంటలో ఎర్రనల్ల చెరువులో ఒకే వర్క్ ఐడీతో పనిచేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆరు వర్క్ ఐడీలు సృష్టించి సుమారు రూ.27 లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల్లో క్షేత్రస్థాయి లో పనులు జరిగిన ఆనవాళ్లు లేకుండానే బిల్లు ల చెల్లింపులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. లేని పనులకు ఎంబుక్‌లు కొలతలు నమోదు చేయడంపై టెక్నికల్, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా చెల్లింపులు చేసినట్లు బహిర్గతమైంది. కొలతల్లో భారీ తేడాలు, చేయని పనులు చేసి నట్లు సృష్టించడం, పనిదినాల కన్నా తక్కువ లేదా ఎక్కువరోజులకు చెల్లింపులు, ఒకేరకమైన సంతకాలతో చెల్లింపులు, ఉద్యోగుల పేరి ట కూలి చెల్లింపులు, రైతుల సంతకాలు లేకుండా, చేపట్టిన పనులకు ఫొటోలు కూడా లేకుండా పంటకాలువ పనులకు బిల్లులు, ఊళ్లలో లేకుండా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పేరిట బిల్లుల చెల్లింపులు చేపట్టడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు.ప్రధానంగా మట్టిరోడ్ల నిర్మాణంలో వందల మీటర్ల మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా తే డాలు, నిధులు స్వాహా, దుర్వినియోగంపై రికవరీ, విచారణ, శాఖాపరమైన కఠినచర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఓఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తిపేరుతో కూడా ఉపాధికూలీ చెల్లింపులు చేసినట్లు తేల్చడం, మరో పాఠశాలలో ఉపా ధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు తో కూడా చెల్లింపులు జరిగినట్లు తేల్చారు. కొన్నిపనుల కు మస్టర్‌లు మాయమైనట్లు తేలింది. డిస్ట్రిక్స్ విజిలెన్స్ అధికారి హీరాలాల్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి విజయకుమారి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రభాకర్, ఎస్‌ఆర్‌పి తులసీనాయక్, ఏపీడీ పి.వి.నారాయణ పాల్గొన్నారు.
సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.7.28 కోట్ల మేర పనులపై ప్రజావేదిక నిర్వహిస్తుంటే వేదిక ముందు కుర్చీలు ప్రజలు లేక వెలవెలబోయాయి. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు లేక నకరికల్లులోని ప్రజావేదిక నీరుగారింది. ఉపాధిహామీ సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.
‘ఉపాధి’లో కాసుల పంట


