దిగజారుడు రాజకీయం చంద్రబాబుకే సాధ్యం
పిడుగురాళ్ల: దేశంలోనే దిగజారుడు రాజకీయం చేయటం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, సాక్షాత్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటోలతో తప్పుడు ఫ్లెక్సీలను వేసి ఆ విషయాన్ని నిరూపించుకున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో దిగజారుడుతనం చూస్తున్నాంగానీ, ఇంతటి చిల్లర రాజకీయం దేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు తాను అన్ని విధాలుగా విఫలం అయ్యానని తెలుసుకుని సాక్షాత్తూ ఆ దేవదేవుడు వెంకన్న స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారని మండిపడ్డారు. ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అన్నారు, చెప్పరాని పదాలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పద్ధతి మారలేదన్నారు.
మాట మార్చిన కూటమి నేతలు
ఇప్పుడు కొత్తగా ఇది కాదని, కెమికల్స్ ఉన్నాయని... ఏది పడితే అది మాట్లాడటం కూటమి నేతల దిగజారుడు రాజకీయానికి అద్దం పట్టిందన్నారు. ఏ పార్టీ నాయకులైనా ఆ పార్టీ అధిష్టానం, వారు నిర్వహించిన అభివృద్ధి గురించి బ్యానర్లు వేసుకుంటారని గుర్తుచేశారు. గత 20 నెలలుగా చేసిందేమీ లేక చివరికి లడ్డూలో ఏదో కలిసిందని తప్పుడు ప్రచారంతో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచార ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఎవరు వేశారో తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ పార్టీ కార్యకర్తలే వాటిని తొలగించారని తెలిపారు. బాధ్యులపై తమ ప్రభుత్వం రాగానే నాన్‌బెయిల్‌బుల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేశారో ఫ్లెక్సీలలో వేయాలని, లడ్డూ చూపించి ఫ్లెక్సీలను వేసుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు.
సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగటం దారుణం
వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే
కాసు మహేష్‌రెడ్డి


