
పొగాకు కొనుగోళ్లు బంద్..!
యడ్లపాడు: పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లు కేంద్రం ఏర్పాటు ముణ్నాళ్ల ముచ్చటగా మిగింది. రైతన్న ఆశ ఆవిరైంది. మండలంలోని స్పైసెస్‌పార్కులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ రకం పొగాకు కొనుగోలు కేంద్రం వారం రోజులుగా మూతపడింది. పొగాకు బేళ్లతో ప్రస్తుతం ఉన్న వేర్‌హౌసింగ్ గోదాము నిండుకుందని, మరో గోదాము చూసే వరకు కొనుగోళ్లు నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
యాప్‌లో నమోదు చేసుకున్నా...
పంట అమ్మకం కోసం గ్రామ సచివాలయంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకుని నెలలు గడుస్తున్నా.. కొనుగోలు తేదీ ఖారరు కావడం లేదు. నెలల తరబడి పొగాకు బేళ్లు అమ్ముడు కాక, తమ ఇళ్లల్లో ఉంచుకునే జాగా లేక రోడ్ల వెండి, పంట పొలాల్లో పరదాలు కప్పి నిల్వ చేసుకున్నారు. ఒకవైపు అప్పులు భారం, మరోవైపు వర్షానికి పొగాకు తడుస్తుందనే భయం.. అన్నింటికీ మించి ఎప్పుడు ఎంతకు అమ్ముడు పోతుందోననే ఆందోళనతో రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు.
టీడీపీ నేతల సిఫార్సులకే తొలిప్రాధాన్యం
రైతులకు కేంద్రం వద్దకు ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకురావాలో ముందస్తు సమాచారాన్ని ఫోన్కు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. కానీ ముందస్తు నమోదు చేసుకున్న వారికంటే ముందుగా నేతల సిఫార్సుతో అధికార పార్టీ వారివి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. సీఎం యాప్‌లో నమోదు చేసి 40–50 రోజులు దాటినా నేటికీ తమ పేర్లు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు యడ్లపాడులోని పొగాకు కేంద్రాన్ని సందర్శించి ఇంత మందకోడిగా కొంటే ఎలా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట మార్కెట్‌యార్డులోని కేంద్రం వద్ద కమ్మవారిపాలెంకు చెందిన రైతు కిలారు పుల్లారావు తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించలేదంటూ ఆవేదనతో తెచ్చిన బేళ్లనుంచి 10 కేజీల పొగాకును కేంద్ర వద్ద కాల్చిన విషయం తెలిసిందే.
అధికారులు ఏమంటున్నారంటే...
ఈ విషయంపై పొగాకు బయ్యర్లను, వ్యవసాయ అధికారులను వివరణకు కోరగా తాజాగా చిన్న, సన్నకారు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. యాప్‌లో ముందుగా నమోదు చేసుకున్నా వారిలో 20 క్వింటాళ్లలోపు వారివే కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ తర్వాత 30 క్వింటాళ్లు, 40, 50, 70, 100 ఇలా వరుస క్రమంలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా సత్తెనపల్లిలో కేంద్రం ఏర్పాటు చేశాం. త్వరలో యడ్లపాడు పరిధిలో కొనేందుకు గోదాముల్ని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
గోదాములు నిండాయని
కేంద్రం మూసివేత
అనుకూలమైన గోదాము లభించాక ఏర్పాటు చేస్తామని ప్రకటన
అప్పటి వరకు సత్తెనపల్లి కేంద్రంలో
కొనుగోలు చేస్తామని అధికారులు వెల్లడి