
భార్యను నమ్మించి ఉసురుతీశాడు...
నరసరావుపేట టౌన్: భర్తపై పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట ఉరితాడైంది.. పోలీస్ గడప తొక్కితే తన గడపలో కాపురం కుదుటపడుతుందని భావించిన ఆమెకు అదే ఆఖరి ఘడియలుగా మారాయి. మద్యానికి బానిసైన భర్త, భార్యను నమ్మకంగా కడతేర్చిన ఘటన నరసరావుపేటలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. కంభంపాలేనికి చెందిన తొరటి మేరి(29), సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్‌ను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. రమేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రమేష్, భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. శనివారం పోలీస్ స్టేషన్‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భర్తను బెదిరించింది. తాను కూడా వస్తానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్టేషన్‌న్‌కు తీసుకెళ్లకుండా రావిపాడు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తల్లి కోటమ్మకు ఫోన్ చేసి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ అని రావటంతో అనుమానం వచ్చిన కోటమ్మ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశారు. రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
చున్నీతో గొంతు నులిమి హత్య..
భార్యను ద్విచక్ర వాహనంపై శనివారం తీసుకెళ్లిన భర్త రమేష్ నకరికల్లు నుంచి కారంపూడి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పక్కన నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీతో బిగించి కాలుతో నొక్కి దారుణంగా హత్య చేశాడు. రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం వన్‌టౌన్ సీఐ ఎం.విజయ్ చరణ్, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న వైనం
నమ్మకంగా తీసుకెళ్లి
చున్నీతో హత్య చేసిన భర్త
నరసరావుపేటలో వెలుగు చూసిన దారుణం

భార్యను నమ్మించి ఉసురుతీశాడు...