
పోలీసుల అదుపులో బంగారం దొంగలు
చోరీ సొత్తు కోసం పోలీసులు ప్రయత్నం
రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంతగుడిపాడు గ్రామానికి చెందిన రామాల ప్రసన్నారెడ్డి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ఇంటి పైకప్పు కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి 20 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ప్రమాదానికి గురై అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యజమానులు ఇంట్లో లేకపోవడాన్ని అదునుగా చూసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఆయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తాను నష్టపోయిన సొమ్మును రికవరీ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులకు స్పందనలో తెలియజేశారు. అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. లభ్యమైన క్లూ ఆధారంగా అనుమానిత దొంగలను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగిలించిన బంగారాన్ని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తనఖాపెట్టి కొంత రుణాన్ని పొందినట్లు తెలుసుకున్నారు. తాకట్టు ఉంచిన కొన్ని రోజుల తర్వాత వేరే వారితో డబ్బులు కట్టించి బంగారాన్ని విడిపించినట్లు ఒప్పుకున్నారు. ఆ బంగారాన్ని మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
విద్యుదాఘాతంతో రైతు మృతి
బొల్లాపల్లి: తెగిపడిన విద్యుత్ వైర్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామ పొలాల్లో జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా తాహసీల్ నాయక్ (50)కి రెండెకరాల సొంత భూమి ఉంది. తన పొలంలో పత్తి పంట సాగు చేశాడు. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం తన భార్యతోపాటు కూలీలను తీసుకుని పొలానికి పత్తి విరుపు కోసం వెళ్లారు. పొలాన్ని ఆనుకుని ఉన్న 11 కె.వి, ఎల్‌టీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఎల్‌టీ విద్యుత్ లైన్ వైరు తెగి పొలం చుట్టూ ఏర్పాటుచేసిన సోలార్ ఫెన్సింగ్ వైర్‌పై పడింది. నాయక్ ఇది గమనించలేదు. పొలంలోకి వెళ్లేందుకు ఫెన్సింగ్ తొలగిస్తుండగా తెగిపోయిన విద్యుత్ వైరు కాలికి తగిలింది. షాక్‌కు గురై రైతు తహసీల్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య నలుగురు సంతానం ఉన్నారు. భార్య మంగబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బండ్లమోటు ఎస్సై ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అధికారుల తప్పిదం వల్లే ప్రమాదం
ఒకే స్తంభానికి ఎల్‌టీ, 11 కేవీ విద్యుత్ వైర్లు విద్యు త్‌శాఖ ఏర్పాటు చేసిందని, నిబంధన ప్రకారం పైన 11 కేవీ విద్యుత్ లైన్ ఉండాలని కింద ఎల్‌టీ విద్యు త్ వైర్లు ఏర్పాటు చేయాలని కానీ అలా చేయలేదని, వైర్లు తెగిపడి ప్రమాదం జరిగి రైతు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యాన్ని వీడి విద్యుత్ లైన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పోలీసుల అదుపులో బంగారం దొంగలు

పోలీసుల అదుపులో బంగారం దొంగలు