నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పల్నాడుజిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 128 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు తెలుగు పరీక్షకు 26,497మంది విద్యార్థులకు గాను 99.5శాతం హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రికార్డు స్థాయిలో 72 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. అలాగే డీఈఓ ఎల్.చంద్రకళ పట్టణంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను సందర్శించి సీఎస్‌లకు పలు సూచనలు చేశారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాలలో తొలిరోజు నాలుగు కేంద్రాలలో నిర్వహించిన హిందీ పరీక్షకు నలుగురు విద్యార్థులకు గాను ఇద్దరు హాజరైనట్టు తెలిపారు. జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు తెలుగు పరీక్షకు 99.5శాతం హాజరు 72 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన 6 స్క్వాడ్ బృందాలు