ఇదేం చిత్రం: హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు జరిమానా

Without Helmet Challan To Truck Driver In Ganjam, Odisha - Sakshi

భువనేశ్వర్‌: నిబంధనల పేరిట ట్రాఫిక్‌ పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబుకు చిల్లు వేస్తున్నారు. ప్రశ్నిస్తే మీ రక్షణ.. మీ భద్రత కోసమే ఇలా చేస్తున్నామని బదులు ఇస్తున్నారు. అయితే ఒక్కోసారి వీరి చేష్టలు.. ప్రవర్తన.. పని ప్రజలకు చిర్రెత్తుత్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో జరిగింది. హెల్మెట్‌ ధరించలేదని ట్రక్కు డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడి ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకునేందుకు ట్రక్కు డ్రైవర్‌ ప్రమోద్‌ కుమార్‌ శ్వాన్ జిల్లా కేంద్రం గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అతడి వివరాలు పరిశీలించగా ఒక జరిమానా పెండింగ్‌లో ఉందని గుర్తించారు. అదేమిటంటే ‘హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం’ అని ఉంది. దీన్ని చూసి ప్రమోద్‌ కుమార్‌ షాక్‌కు గురయ్యాడు. ట్రక్కు నడిపే డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించడమేంటి అని సందేహం వ్యక్తం చేశాడు. ట్రక్కు వాహనం నంబర్‌పైనే హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపాడని జరిమానా విధించడం గమనార్హం. అధికారులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ డ్రైవర్‌ ప్రమోద్‌ కుమార్‌ రూ.వెయ్యి జరిమానా కట్టేశాడు. అనంతరం అతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేశారు. 

‘మూడేళ్లుగా ట్రక్కు నడుపుతున్నా. నీటి సరఫరా చేసేందుకు ట్రక్కు వినియోగిస్తున్నా. నా పర్మిట్‌ గడువు ముగియడంతో రెన్యూవల్‌ కోసం ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాను. అక్కడ హెల్మెట్‌ లేకుండా ట్రక్కు నడుపుతున్నానని జరిమానా విధించారు. డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా వేధిస్తున్నారు. ఇలాంటి తప్పులను ప్రభుత్వం నిరోధించాలి’ అని ట్రక్కు డ్రైవర్‌ ప్రమోద్‌ కుమార్‌ మీడియాతో చెప్పాడు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top