మల్కన్‌గిరి: ఉత్కళమణి గోపబంధు దాస్ 149వ జయంతి కార్యక్రమాన్ని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ సిబ్బందితో పాటు జిల్లాలోని వివిధ మీడియా ప్రతినిధులు పాల్గొని గోపబంధుదాస్ సామాజిక, జర్నలిజం రంగాలకు అందించిన సేవలు, ఒడిశా రాష్ట్ర నిర్మాణంలో ఆయన పాత్రలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్ ప్రమిళ మాఝి, సీనియర్ జర్నలిస్టు రత్నకర్ దాస్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి తీవ్ర గాయాలు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ మిశ్ర (పింటూ) తీవ్ర గాయాలపాలయ్యారు. నబరంగ్‌పూర్ జిల్లా కోర్టు నుంచి నివాసానికి బైక్‌పై తిరిగి వస్తుండగా బండి అదుపు తప్పింది. ఈ ఘటనలో కుడి కాలు ఛిద్రమైంది. స్థానికులు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వెంటనే జయపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకి తరలించారు. అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్లారు.
ఆరుబయటే పాఠాల బోధన
సారవకోట: మహాశింగి పంచాయతీ రేగులపాడు గ్రామంలో విద్యార్థులకు చెట్టు కింద పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడున్న పాఠశాల భవనం శిథిలం కావడంతో ఇటీవల కూలగొట్టారు. దీంతో ఉపాధ్యాయుని హరిత గ్రామంలోని ఓ ఇంటి వద్ద తరగతులు ప్రారంభించారు. రెండు రోజుల కిందట భవానీ, అయ్యప్పదీక్షలు వేసేందుకు సిద్ధం కావడంతో ఇంటిని అప్పాజెప్పాలని యజమాని సూచించడంతో ఉపాధ్యాయుని అదే ఇంటి బయట ఉన్న చెట్టు కింద పాఠాలు బోధిస్తున్నారు.
‘సాంకేతికతతో తపాలా సేవలు సులభతరం’
శ్రీకాకుళం అర్బన్: మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా సేవలను సులభతరం చేస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో అక్టోబరు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఒకే తపాలా నెట్‌వర్క్–అనంతమైన అవకాశాలు అనే ప్రధాన అంశంతో ఈ వేడుకలు సాగుతాయని స్పష్టం చేశారు. 12న తపాలా బిళ్లల సేకరణపై అవగాహన దినోత్సవం, 13న ఆర్థిక సమ్మేళితత్వం, పౌర కేంద్రీకృత సేవల దినోత్సవం, 14న మెయిల్స్, పార్సిళ్ల దినోత్సవం, 15న సాంకేతికత, ఆవిష్కరణల దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మృతి
నందిగాం: నర్సిపురం పంచాయతీ కోమటూరుకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇప్పిలి షణ్ముఖరావు(39) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటూరుకు చెందిన జనార్దనరావు, జయలక్ష్మీ దంపతులకు షణ్ముఖరావు ఒక్కడే కుమారుడు. ఆర్మీలో పనిచేసి ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. గ్రామంలో పొట్టేళ్ల ఫారమ్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటలకు పొట్టేళ్ల మేత కోసం ద్విచక్ర వాహనంపై టెక్కలి వెళ్లి తిరిగి 11.45 గంటల ప్రాంతంలో వస్తుండగా టెక్కలి మండలం శాసనాం వద్ద గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టింది. తల మీదుగా చ క్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. షణ్ముఖరావుకు భార్య దివ్య, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, 8వ తరగతి చదువు తున్న కుమారుడు ఉన్నారు. నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేశారు.


