సికరపాయి బలిజాతరలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

సికరపాయి బలిజాతరలో అపశ్రుతి

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

రాయగడ: జిల్లాలోని సికరపాయిలో శుక్రవారం రాత్రి పాతకక్షల నేపథ్యంలో జరిగిన కత్తితో దాడి ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో మృతి చెందిన వ్యక్తి బుడాగుడ గ్రామానికి చెందిన మహేష్‌ కడ్రక (32) గా గుర్తించగా గాయాలకు గురైన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రొహన్‌ కడ్రక గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని క్షతగాత్రుని సమీపంలో గల హస్పటల్‌కు చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల సికరపాయి గ్రామంలో బలిజాత్ర జరుగుతుంది. బలిజాత్రను చూసేందుకు వెళ్లిన రొహన్‌, మహేష్‌ లపై కొందరు యువకులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మహేష్‌ తీవ్రగాయాలకు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుండి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

ఎచ్చెర్ల : కుప్పిలి పంచాయితీ యాతపేటకు చెందిన ముంత గీత (17) అనే బాలిక శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత తండ్రి ఎర్రయ్య ఉపాధి నిమిత్తం చేపల వేటకు గుజరాత్‌ వెళ్లాడు. తల్లి రమణమ్మ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరికి ముగ్గురు బిడ్డలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమారుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. రెండో కుమార్తె గీత పదో తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిని చూసి తల్లి మందలించింది. దీంతో గీత మనస్థాపానికి గురై ఉరి వేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో ఇరుగుపొరుగు వారికి చెప్పింది. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తల్లి ఫిర్యాదుమేరకు ఎచ్చెర్ల ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుంచి జూనియర్‌ కాలేజీలకు దసరాల సెలవులు

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ కోర్సులను అందిస్తున్న అన్ని యాజమాన్యాల జూనియర్‌ కళాశాలలకు ప్రభుత్వం శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. మరళా ఈ నెల 21న తరగతులు పునఃప్రారంభంకానున్నాయని పేర్కొంది. సెలవుల్లో ప్రత్యేక క్లాసులు, శిక్షణ అంటూ తరగతులు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఇంటర్‌బోర్డు జిల్లా ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement