రాయగడ: గ్రామీణ ప్రాంతాల యువతులు, మహిళలకు డిజిటల్ విద్యను చేరువ చేసేందుకు ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయిస్ (ఇంఫా) ప్లాంట్ యాజమాన్యం, వంశీధర్ ఇలా ఫౌండేషన్ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ–శిక్షా ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రారంభించిన మోబైల్ విద్యా వాహనం గ్రామ గ్రామాణా పర్యటిస్తూ కంప్యూటర్ విద్యను అందించనుంది. డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థులు రవాణ, సౌకర్యాల కొరత, దూరభారం కారణంగా విద్యకు దూరమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వారి గ్రామాల్లోనే డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా వాహనం ద్వారా ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు మైక్రోసాఫ్టు ఆఫీస్, ఇంటర్‌నెట్ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ భద్రత వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు. దీని వల్ల గ్రామీణ యువతులు, మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని తమ నైపుణ్యతను పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. పైకపడ గ్రామానికి చెందిన పుష్పాంజలి హికక ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందుతున్న విద్యార్థినుల్లో ఒకరు. ఆమె గ్రామం నుంచి పాఠశాల సుమారు ఎనిమిది కిలొమీటర్ల దూరంలో ఉండడంతో రాకపొకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. బస్సు సౌకర్యం లేకపొవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు గ్రామానికి డిజిటల్ విద్య చేరువ కావడంతొ ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లొ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, యువతులు, మహిళలకు సాంకేతిక విద్యను అందుబాటులొకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఇంఫా, వంశీధర్ ఇళా పండా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ విద్యారంగంలొ కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కొలనార ఉపాధ్యక్షుడు హలధర్ హిమిరిక, ఈ–శిక్షా ఉపాధ్యాయురాలు అర్చనా మహాపాత్ర, ఇంఫా తెరువలి డిజీఎం క్షీతీస్ మహాపాత్రొ , యూనిట్ హెడ్ జివి రాకేష్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


