పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులకు, ఒక హత్య కేసులో నిందితుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని సాగువాన్‌ అటవీ ప్రాంతంలోని కార్లాఖమన్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన నిందితులు సునీల మహానంద అలియాస్‌ టాబు, చంద్‌ బంచోర్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరు సోమవారం ఝార్సుగుడ జిల్లాలోని బెల్పహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఒక యువకుని హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం కారులొ ప్రయాణిస్తున్న వ్యక్తులు అదే రహదాలో బైకుపై వెళుతున్న ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసింది. చినికిచినికి గాలివానలా మారిన ఈ వాగ్వాదంలో రాహుల్‌ మహత, అతని స్నేహితుడు ఆకాష్‌ సాహుపై కత్తితో కారులో వస్తున్న వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రాహుల్‌ మహాత మృతి చెందగా ఆకాష్‌ సాహు తీవ్రగాయాలతో ఝార్సుగుడ హస్పటల్‌లొ చికిత్స పొందుతున్నాడు. ఘటన అనంతరం పోలీసులు కార్‌ డ్రైవర్‌తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే సునీల మహానంద, చంద్‌ బంచొర్‌ పరారీలొ ఉన్నారు. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కార్లాఖమాన్‌ గ్రామసమీపంలొ దాక్కున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు దొరికిపోతామన్న భయంతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు నిందితుల కాళ్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయని ఎస్పీ రాఘవేంద్ర తెలియజేశారు. ఈ సంఘటనలో నిందితులు మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరపగా, పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. గాయపడిన నిందితులను మొదట లక్ష్మన్‌పూర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను చేయించడంతో పాటు మెరుగైన చికిత్స కొసం వారిని వెంటనే ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇందులో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో బుర్లా మెడికల్‌ కళాశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement