● సైకిల్‌పై మృతదేహంతో నిరసన
భువనేశ్వర్: పొరుగు వారితో జరిగిన చిరు తగాదాతో పట్ట పగలు మహిళ దారుణ హత్యకు గురైంది. బాలాసోర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, నిందితులను పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మంగళ వారం ఉదయం ఆమె మృతదేహాన్ని సైకిల్‌పై దాదాపు 15 కిలో మీటర్ల దూరం ఖొయిరా పోలీస్ ఠాణా వరకు తీసుకు వెళ్లారు. హరిపూర్ గ్రామంలో ఆదివారం నాడు వారి పొరుగువాడు గొడ్డలితో దాడి చేయడంతో కమలా సెఠి మరణించింది. ఆమె వదిన తీవ్రంగా గాయపడింది. పోస్టు మార్టం తర్వాత మృత దేహాన్ని తమకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు దాన్ని సైకిల్‌పై ఎక్కించుకుని పోలీస్ ఠాణా వైపు కవాతు చేశారు. దారి పొడవునా పట్టపగలు ఆమెను ఎలా నరికి చంపారో వారు ప్రజలకు వివరించారు. నడి రోడ్డు మీద కొనసాగుతున్న నిరసన సమాచారం అందడంతో ఖొయిరా ఠాణా పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మృతదేహాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను నిరసనకారులు నిరాకరించారు. మృత దేహాన్ని రోడ్డుపై ఉంచి పోలీస్ ఠాణా సమీపంలో ప్రదర్శన నిర్వహించారు.
కమలా సెఠి ఇంట్లో పైకప్పు నిర్మాణానికి సెంటరింగ్ పనులు జరుగుతుండగా ఎండు కట్టెలు, వెదురు కరల్రు, ఖాళీ ప్లాస్టిక్ సంచులు వంటి నిర్మాణ సామగ్రి పొరబాటున జారి పొరుగున ఉన్న మానస్ జెనా ఇంటి ఆవరణలో పడటంతో ఈ వివాదం చెలరేగింది. సెంటరింగ్ పనులు పూర్తయ్యాక నిర్మాణ సామగ్రిని తొలగిస్తామని కమల, శకుంతల అభ్యర్థించిన మానస్ జెనా వారితో తీవ్ర వాగ్వాదానికి తలపడ్డాడు. తీవ్ర ఆగ్రహ ఆవేశంతో అతడు గొడ్డలిని తీసుకుని కమల, శకుంతలపై దాడి చేసినట్లు ఆరోపణ.
దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఖొయిరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో తొలుత భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి, ఆ తర్వాత కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం రాత్రి గాయాలతో చికిత్స పొందుతూ కమలా సెఠి తుది శ్వాస విడిచింది. దాడిలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఖొయిరా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి భారతి జెనాని అరెస్టు చేశారు. మానస్ తన తండ్రి భరత్ జెనాతో కలిసి పరారీలో ఉన్నాడు, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని బాలాసోర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు.


