తుఫాన్‌పై సన్నద్ధత | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌పై సన్నద్ధత

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

భువనేశ్వర్‌: ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్‌ అధ్యక్షతన మంగళ వారం తుఫాను సన్నద్ధతా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనూ గర్గ్‌ మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టుకోవాలన్నారు. అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని శర వేగంగా ప్రసారం చేయడం జరగాలని సూచించారు. పటిష్టమైన సన్నద్ధత, మెరుగైన సమన్వయం, ముందస్తు హెచ్చరికలను సకాలంలో అందించడం ద్వారా జీరో క్యాజువాలిటీ మిషన్‌కు కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు.

తుఫాను, వరద ఆశ్రయాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చూడాలని, నియంత్రణ గదులను తక్షణమే క్రియాశీలం చేయాలని, మరియు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీ) ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా మత్స్యకారులకు తుఫాను హెచ్చరికలను సకాలంలో తెలియజేయడం, సమర్థమైన విపత్తు ప్రతిస్పందన కోసం శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

గాలింపు, సహాయక చర్యల కోసం 30 ఒడీఆర్‌ఏఎఫ్‌ బృందాలు తక్షణమే రంగంలోకి దిగేందుకు సన్నద్ధంగా ఉన్నాయని అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (శాంతి భద్రతలు) తెలిపారు.

ప్రస్తుతం ఒడిశా తీరంలో తుఫాను వచ్చే అవకాశం లేదని స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ మనోరమ మహంతి తెలియజేశారు. అయినప్పటికీ రాష్ట్రం అన్ని స్థాయిలలో పూర్తి సన్నద్ధతను కొనసాగించాలని ఆమె సూచించారు. సమావేశానికి అభివృద్ధి కమిషనర్‌ కమ్‌ అదనపు ప్రధాన కార్యదర్శి డీకే సింగ్‌, అగ్నిమాపక సేవల డైరెక్టరు జనలర్‌ డాక్టర్‌ ఎస్‌. షడంగి, ప్రత్యేక సహాయ కమిషనర్‌, భారత వాతావరణ శాఖ, ఓడీఆర్‌ఏఎఫ్‌ ఉన్నతాధికారులు, సంబంధిత అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement