రాయగడ: స్థానిక పితామహాల్ వద్ద గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ నర్శింగ్ ఆధ్వర్యంలొ ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్న నర్సెస్ వీక్ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులు నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉర్మిళ కాటూరు పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల మధ్య వివిధ పోటీలు, సాహిత్య, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, గౌరవ అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ పాత్రోలు హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిథులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాఢి మాట్లాడుతూ.. ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నిరంతర విద్యాభ్యాసం, మానవతా సేవల పట్ల అంకితభావం అవసరమని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో నిబద్ధతతో సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు.


