మజ్జిగౌరీ మందిరం అభివృద్ధిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

మజ్జిగౌరీ మందిరం అభివృద్ధిపై సమీక్ష

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ మందిరం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఆధికారులతో మంగళవారం సమీక్షించారు. మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు బీజేడీ ప్రభుత్వ హయాంలో 26 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి గత ఏడాది ఆగస్టు 29వ తేదిన అభివృద్ధి పనులకు భూమి పూజ జరిగింది. బరంపురానికి చెందిన ఒక కాంట్రాక్ట్‌ కంపెనీకి టెండర్‌ లభించింది. రెండేళ్లలో నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నది షరతు. అయితే భూమి పూజ ప్రారంభించి ఆరు నెలలు గడిచినప్పటికీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టలేదు. అయితే గత నాలుగు నెలలుగా అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా పనుల శాఖ అధికారులతో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో సమీక్షించారు. త్వరలో పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మందిరం ప్రవేశద్వారం నామమాత్రంగా కాకుండా అందరినీ ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌, డార్మిటరీ, ప్రసాద సేవన గృహం పనులు జూన్‌ చివరి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తామని అధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement