రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన హడిప నిఖిల్ (18) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని మొదట అపహరించి అనంతరం అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేశారు. అటువైపుగా వెళ్లిన కొందరు యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, ఎస్‌డీపీఓ గౌరహరి సా హు, పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్న కుమార్ సైంటిఫిక్ టీమ్‌తో చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహా న్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం రాత్రి నుంచే పోలీసులు గాలింపు
శనివారం రాత్రి పదిన్నర గంటలకు ఇందిరానగర్‌లో తుపాకీల గుళ్ల మోతతో కలకలం రేపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఫైరింగ్ చేసినట్లు కాలనీ వాళ్ల సమాచారం మేరకు ఆ దిశగా దుండగులను గాలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మృతదేహం లభించిన స్థలానికి చేరుకున్న ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు విలేకర్లతొ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ఇదిలాఉండగా ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబీకులు రెల్లివీధికి చెందిన మహిళలు సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో టైర్లను కాల్చి రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తుతో పోలీస్ స్టేషన్ ఎదుట పహారా కాశారు.
నిందితులను గుర్తించాం
శనివారం రాత్రి సుమారు సదరు పోలీస్ స్టేషన్‌లో నిఖిల్ అనే యువకుడి తల్లి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని ఎస్పీ స్వాతి తెలియజేశారు. ఈ మేరకు సదరు పోలీసులు కేసు నమోదు చేసి మూడు టీమ్‌లుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం కనిపించకుండాపోయిన నిఖిల్ అనే యువకుని మృతదేహం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నది వద్ద ఉందని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసు బలగాలతొ చేరుకున్నామని ఎస్పీ వివరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులను గుర్తించామని త్వరలో వారిని పట్టుకుంటామని అన్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు నిందితులను పట్టుకున్న తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్థానిక ఇందిరానగర్ మూడో లైన్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక మోటార్ సైకిల్, మరో వాహనంలో చేరుకున్నారు. అక్కడ ఏదో పనిమీద ఉన్న హడిప నిఖిల్ ఉండటం ముందుగానే గమనించిన దుండగులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరి రాకను గమనించిన నిఖిల్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దుండగులు తమ వెంట తీసుకువచ్చిన తుపాకీతొ రెండు రౌండ్లు పేల్చారు. దీంతో భయాందోళనకు గురైన నిఖిల్ ఇందిరానగర్ కాలనీలోని ఒకరి ఇంటిలోకి దూరిపోయాడు. వెంబడిస్తూ వెళ్లిన దుండగులు అతడిని పట్టుకుని తమ వెంట రింగ్ రోడ్డు వైపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి అతడిని దారుణంగా హత్య చేసి రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నదికి దగ్గరలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపాయారు. ఆదివారం తెల్లవారున నిఖిల్ మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.


