భువనేశ్వర్: ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఒడిశా సంగీత నాటక అకాడమీ, కలహండి జిల్లా సాంస్కృతిక మండలి, శుభం ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో డొంగొరొ గిరిజన నృత్య, సంగీత ఉత్సవం ఉర్రూతలూగించింది. రెండు రోజుల పాటు భవానీపట్నం మహావీర్ కల్చరల్ ఇన్‌స్టిట్యూట్ రంగమంచ్‌లో జరిగిన ఈ సాంస్కృతిక ఉత్సవం ఆదివారంతో ముగిసింది. యువ కళాకారులు గిరిజన సమాజం నృత్య, సంగీత సంప్రదాయంలోని మౌలిక స్వభావం, విశిష్టతని ప్రతిబింబించారు. గిరిజన నృత్య, సంగీత ప్రదర్శనలకు ఉజ్వల భవిష్యత్ చేరువలో ఉందని ఈ వర్గం ఆశాభావం వ్యక్తం చేసింది. గిరిజన సంప్రదాయ నృత్య, సంగీత కళలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రపంచానికి తెలియజేసేందుకు యువ కళాకారులు తమ నిరంతర కృషిని కొనసాగించాలని అతిథులు అభిప్రాయపడ్డారు. డొంగొరొ నృత్యోత్సవంలో కోయ, ఖడియా, కిసాన్, పొతొరొ సౌరా, లంజియా సౌరా, ఢెమ్సా, పంచరసి, గిరిజన నృత్యం, సింగారి నృత్యం ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.


