● నలుగురు పోలీసు అధికారులు సస్పెండ్
● ఐఐసీ అనిల్ పరిడా బదిలీ
భువనేశ్వర్: బలియంత మూక దాడి ఘటనపై క్రైం శాఖ దర్యాప్తు ప్రారంభం అయింది. ఈ నెల 7వ తేదీన గ్రామస్తుల మూక దాడిలో 32 ఏళ్ల ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) కానిస్టేబులు సౌమ్య రంజన్ స్వంయి మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి క్రైం శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు సూపరింటెండెంట్ అనిరుధ్ రౌత్రాయ్ ఆధ్వర్యంలో క్రైమ్ శాఖ దర్యాప్తు బృందం ఆది వారం బలియంత పోలీస్ ఠాణాకు చేరింది. ఈ బృందం దర్యాప్తు అధికారి నుంచి కేసుకు సంబంధించిన పత్రాల ఆధారంగా దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. ఈ దర్యాప్తు పూర్తిగా వాస్తవాల ఆధారంగా సాక్ష్యాధారాలతోనే సాగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై క్రైమ్ శాఖ డీఐజీ బి. గంగాధర్ మాట్లాడుతూ 10 మంది అధికారులతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ బృందాలలో శాసీ్త్రయ, సైబర్ విభాగాల నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్‌లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు, హత్యాయత్నం, పోలీసుల నిర్లక్ష్యం వంటి పలు అంశాలను ఈ దర్యాప్తులో క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. తొలి దశ దర్యాప్తు ఆధారంగా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఘటన తీవ్రత దృష్ట్యా బలియంత పోలీస్ ఠాణా ఇనస్పెక్టర్ ఇన్ ఛార్జ్ (ఐఐసీ) అనిల్ పరిడాను భువనేశ్వర్‌లోని యూపీడీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ), 1 ఒడిశా సాయుధ పోలీసు దళం (ఓఏపీఎఫ్) ఉద్యోగి మరియు ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. 2 మంది హోం గార్డులను విధుల నుండి తొలగించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఘటనా సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యం కారణాలతో ఈ కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. దర్యాప్తు కొనసాగుతోంది మరియు రానున్న రోజుల్లో నిందితులపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.


