సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. నౌపడలో కేటాయించిన పునరావాస కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో మూలపేట గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు, రోడ్లు లేకపోవడం, డ్రైనేజీలు అరకొరగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్స్‌తో వస్తున్న ట్రాక్టర్, టిప్పర్లు తరచూ బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం కూడా ఇదే సమస్య పునరావృతం కావడంతో అవస్థలు పడ్డారు. తమ భూములు, గ్రామాన్ని పోర్టుకు ఇస్తే త్యాగాలను గుర్తించకుండా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.


