అధికారులూ.. ఇదేం తీరు..! | - | Sakshi
Sakshi News home page

అధికారులూ.. ఇదేం తీరు..!

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

● కార్పొరేట్‌ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను ● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం!

● కార్పొరేట్‌ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను ● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం!

శ్రీకాకుళం : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్‌ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న చిన్న ప్రైవేట్‌ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్‌ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖలోనే చర్చ జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్‌లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని, ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి అందరినీ ఒకేలా చూడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా తాము ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారు సమ్మతిస్తే ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని మాత్రమే చెప్పారని, ఎంఈఓలు టీసీలు ఇస్తారనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement