రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావ సర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రతి నెలా తమ ట్రస్టు తరఫున నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు బియ్యం, కందిపుప్పు, దుంపలు, నూనె, తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్య ఇక్కడ ట్రస్టును ఏర్పాటు చేశారన్నారు. ట్రస్టు ద్వారా పేదలైన ఆదివాసీ యువతులకు చదివించడంతోపాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇలా దాదాపు వంద మందికి పైగా యువతులు ట్రస్టు ద్వారా సాయం పొందుతున్నారన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు
23 వినతులు
మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్‌ఎస్ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ ఎర్.అప్పలరాజు, తహసీల్దార్ మిస్క శ్రీకాంత్ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ విద్యుత్‌ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
‘వేధింపులు ఆపండి’
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్, వై.దుర్గారావు, ఎస్.జోగారావు, ఎస్‌ఎస్ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు.
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్.మధుసూదనరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హతిగూడ ప్రాంతానికి చెందిన రాజేంద్ర పొలై (22) బరంపురం నుంచి అన్నవరం వైపు రైల్లో ప్రయాణిస్తున్నట్లు అతని వద్ద లభించిన రైల్వే టికెట్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. జనర ల్ బోగీలో ప్రయాణిస్తున్న రాజేంద్ర గుర్తుతెలియని రైలు నుంచి శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ వద్ద జారిపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
25, 26న ఎస్‌బీఐ సమ్మె
శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోగల ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఎస్‌బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు.


