భువనేశ్వర్: రాజధాని నగరం శివార్లు బలియంత పోలీస్ ఠాణా పరిధిలోని భింగరపూర్ ప్రాంతంలో స్థానికుల గుంపు దాడిలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఊగిసలాడుతున్నాడు. ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో స్థానికులు ఈ మారణాంతక దాడికి పాల్పడ్డారు. బలియంత పోలీసు ఠాణా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మోటార్ సైకిల్‌పై వస్తున్న ఇద్దరు యువకులు ఆ మార్గంలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ రచ్చ మొదలైంది. ఈ ప్రమాదం అనంతరం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆ యువకులు తమపై లైంగిక దాడికి ప్రయత్నించారని సహాయం కోసం ఆ మహిళలు గగ్గోలు చేయడంతో పరిస్థితి ఉద్ధృతమైంది. కేకలు విని ఆ ప్రాంత నివాసులు సంఘటనా స్థలానికి గుంపుగా దూసుకొచ్చి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి చేతులు, కాళ్లు కట్టి, వెదురు కరల్రతో దారుణంగా కొట్టారు.
గాయపడిన ఇద్దరు యువకులను తీవ్రమైన పరిస్థితిలో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన అదాస్‌పూర్ ప్రాంతానికి చెందిన సౌమ్య రంజన్ స్వంయి మరణించాడు. అతడు ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) సిబ్బంది అని సమాచారం. గ్రామస్తుల దాడిలో గాయ పడిన మరో యువకుడు ఓంప్రకాష్ రౌత్ పరిస్థితి విష మంగా ఉంది. ఆయన ప్రాణాపాయ పరిస్థితిలో ఊగిసలాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఓం ప్రకాష్ రౌత్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
తీవ్ర ఉద్రిక్తత
దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా పట్టపగలు నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఒక గుంపు ఎలా చంపగలదని మృతుని బంధువులు నిలదీస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మృతుడి కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య ఘర్షణ ఉగ్ర రూపం దాల్చుతుంది. బలియంత ఠాణా పోలీసులు 4 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బలియంత పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి (ఐఐసీ) తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారి మధ్య ఎలాంటి పూర్వ వైరం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలలేదని స్పష్టం చేశారు. ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, యువకులు తమ మోటార్‌సైకిల్‌తో వారిని ఢీకొట్టడానికి ప్రయత్నించి, వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ మహిళలు 112 అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి స్థానికులను అప్రమత్తం చేశారని ఠాణా అధికారి తెలిపారు.


