బహుముఖ పురోగతికి విద్య పునాది | - | Sakshi
Sakshi News home page

బహుముఖ పురోగతికి విద్య పునాది

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి

భువనేశ్వర్‌: దేశ నిర్మాణానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక లోక్‌ సేవా భవన్‌ స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఒడిశాలో జాతీయ విద్యా విధానం 2020 అమలు, ఉన్నత విద్యా సంస్కరణలు శీర్షికతో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, సాహిత్యం వంటి రంగాల్లో జ్ఞానం, వివేకం, మేధో నాయకత్వానికి భారత దేశం ప్రపంచ కేంద్రంగా చారిత్రాత్మకత సంతరించుకుందన్నారు. భారత దేశాన్ని ప్రపంచ విజ్ఞాన అగ్రరాజ్యంగా తీర్చి దిద్దడం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యంగా పేర్కొన్నారు. 2036 నాటికి వికసిత్‌ ఒడిశా, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దార్శనికత సాకారానికి దారితీస్తుందని ఆయన తెలిపారు. ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, ప్రపంచ నాయకత్వం రూపకల్పనలో భారత దేశ జనాభాను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు జాతీయ విద్యా విధానం 2020 బలమైన మార్గదర్శకం అవుతుందన్నారు. జాతీయ పురోగతి, మానవ అభివృద్ధికి పునాది అయిన విద్యను బలోపేతం చేయడానికి ఈ వర్క్‌షాప్‌ సామూహిక నిబద్ధతగా ప్రతిబింబిస్తుందని గవర్నర్‌ అభివర్ణించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), బయోటెక్నాలజీ, డేటా సైన్స్‌, డిజిటల్‌ ఆవిష్కరణలతో ప్రపంచంలో శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని దక్షతతో ఎదుర్కొనేందుకు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, అనుకూలత, అంతర్విషయక అభ్యసనం అవసరం. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా, బట్టీ పద్ధతి నుంచి అనుభవ పూర్వక అభ్యసనం, సంపూర్ణ అభివృద్ధి, బహుళ విషయక విద్య వైపు ఎన్‌ఈపీ 2020 నిర్ణయాత్మక మార్పును ఆవిష్కరిస్తుందన్నారు. నైపుణ్య ఆధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించడం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమ్మిళిత వృద్ధిని నిర్ధారించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డాక్టర్‌ కంభంపాటి అన్నారు. యువత ఉద్యోగ అన్వేషణకు పరిమితం కాకుండా, వినూతన ఆవిష్కరణలు మరియు సరికొత్త అవకాశాల రూపకర్తలుగా విద్య సాధికారత కల్పించే దిశలో ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. ఎన్‌ఈపీ 2020ని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వ విద్యాలయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సమీప గ్రామాలను దత్తత తీసుకుని కృషి చేయాలని గవర్నర్‌ ప్రోత్సహించారు. విద్యార్థుల మేధస్సు, శక్తి సామర్థ్యాలు సామాజిక, జాతీయ అభివృద్ధికి దోహహదపడే రీతిలో మళ్లించాలని గవర్నరు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement