● మూడురోజులు జరగనున్న ఉత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక క్లాత్ మర్చంట్స్, కోమటి వీధిలో నీలమణి దుర్గ అమ్మవారి సంబరాలు ఆదివారం ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వీధిలోకి ఆహ్వానించడానికి మహిళలు పెద్ద ఎత్తున పసుపునీళ్లతో ఒకే రంగు చీరలు కట్టుకుని కాలేజీ రోడ్డులోని గ్రామదేవత నీలమ్మ మందిరానికి సంప్రదాయ నృత్యాలు, డప్పులతో బయలుదేరి వెళ్లారు. నీలమ్మదేవి గుడిలో అమ్మవారికి పూజలు జరిపి పసుపునీళ్లతో అమ్మవారికి చల్లదనం చేశారు. అనంతరం అమ్మవారి అనుగ్రహంతో బుట్టలో పువ్వు పడగానే అందరూ సంతోషించారు. మూడు రోజులపాటు జరిగే అమ్మవారి పండుగలు పదేళ్ల తరువాత మార్కెట్ జంక్షన్ వ్యాపారులు నిర్వహిస్తున్నారు. నీలమ్మదేవి కమిటీ సభ్యులంతా కలసికట్టుగా అమ్మవారి సంబరాలు జరిపించడం విశేషమని ఆడ్వకేటు వి.ఎస్.ఎన్.రాజు, జామి పోలిశెట్టి అన్నారు.


