రేపు టెక్కలిలో ‘రెవెన్యూ క్లినిక్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా మొత్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సర్వే వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మధ్యవర్తిత్వంతో కేసులకు మోక్షం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40 గంటల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మెలకువలు నేర్చుకోవడం వల్ల న్యాయవాదులకే కాకుండా, కక్షిదారులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన న్యాయవాదులు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించి ప్రజలకు భారం తగ్గించాలని సూచించారు. సీనియర్ ట్రైనర్లు వి.పి.తనకచన్, పి.జి.సురేష్‌లు పాల్గొని మధ్యవర్తిత్వంలోని న్యాయపరమైన చిక్కులు, వాటిని పరిష్కరించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


