రహదారి నిబంధనలు పాటించాలి
రాయగడ: ట్రాఫిక్ నియమ, నిబంధనలను పాటించాలని ఎస్‌డీపఓ గౌరహరి సాహు అన్నారు. స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రమాదలు తగ్గుముఖం పట్టాలంటే హెలెట్ వినియోగం, సీటు బెల్టుల వంటివి వినియోగించాలన్నారు. రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలిపొందిన వారికి బహుతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్ ప్రధాన్, ఏఎస్పీ గొసేన్ బల్లా, ఆర్టీఓ బినయ్ కుమార్ పాల్, తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి పథకం ప్రారంభం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్‌లో ప్రధానమంత్రి కృషి సంచయి పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తేవడానికి జలవనరుల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కాశీనగర్ బ్లాక్‌లో గోరిబంద గ్రామంలో రూ.11.50 లక్షలతో తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు చైర్మన్ గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, వాటర్‌షెడ్ పథకాల అధికారి సురేష్ కుమార్ పట్నాయక్, ప్రభుత్వ ప్రాజెక్టు డైరెక్టర్ రశ్మిరేఖా నాయక్, ఏ.డి.ఎం ఫల్గుణి మఝి, కాశీనగర్ బీడీఓ డంభుధర మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.
45 మందికి నేత్ర పరీక్షలు
రాయగడ: జేకే పేపర్ మిల్ సంస్థ ఆధ్వర్యంలో గల రొషిణి ప్రాజెక్టులో భాగంగా కొల్లిగుడ వద్ద శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. స్థానిక పితామహాల్‌లో గల ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 45 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 18 మంది కేటరాక్ట్ అవసరమని గుర్తించారు. కేటరాక్ట్ సమస్యలు ఉన్నవారికి ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని పేపర్ మిల్ డిప్యూటీ మేనేజరు హరిహర్ ఖమారి తెలియజేశారు.
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్‌పేటలో నివాసముంటున్న కదంబాల భాగ్యలక్ష్మి గత నెల 25న మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తుండగా ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా నువాపల్లి గ్రామానికి పులి సుభాషిణిని నిందితురాలిగా గుర్తించి శనివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుంచి ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితురాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ బషీర్‌ని సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు అభినందించారు.
ప్రొఫెసర్ సుజాతకు పేటెంట్ హక్కులు మంజూరు
ఎచ్చెర్ల: యాంటీబయాటిక్ సమూహమైన ‘టెట్రాసైక్లిన్ అనలాగ్’పై పరిశోధనలకు గాను బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగం సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి.సుజాతకు పేటెంట్ (చట్టపరమైన మేథో సంపత్తి హక్కు) మంజూరైంది. 2018 నుంచి ఇరవై ఏళ్లపాటు ఈ హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రధాన పేటెంట్ కార్యాలయం (కోల కత్తా) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుజాతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని శనివారం అభినందించారు.
రహదారి నిబంధనలు పాటించాలి
రహదారి నిబంధనలు పాటించాలి
రహదారి నిబంధనలు పాటించాలి


