తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించాలి
రాయగడ: తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించడం బాధ్యతగా గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరస్వతి మాఝి అన్నారు. స్థానిక డీఆర్‌డిఏ సమావేశం హాల్‌లో శనివారం తల్లిదండ్రుల రక్షణ, సీనియర్ సిటిజన్ల సంరక్షణ, సంక్షేమ చట్టం–2007పై జిల్లా స్థాయి అవగాహన శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మన గుర్తింపు మన తల్లిదండ్రులేనని, అటువంటి వారికి మన స్వాస ఉన్నంత వరకు అండగా నిలవాలన్నారు. కుటుంబ వివాదాలు, వంటరితనం, ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై శిబిరంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పౌరసంబధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లా సామాజిక భద్రత శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి అధ్యక్షత వహించారు.


