విశ్వశాంతి దేవ మహాయజ్ఞం
అట్టహాసంగా 108 కుండీల
రాయగడ: స్థానిక రైతుల కాలనీ సమీపంలో గల జేఎస్‌కో మైదానంలో శనివారం మిట్స్ ఇంజనీరింగ్ గ్రూప్ సంస్థల చైర్మన్ బాలు పండ, బీజేపీ సీనియర్ నాయకుడు యాల్ల కొండబాబుల ఆధ్వర్యంలో 108 కుండీల విశ్వశాంతి దేవ మహాయజ్ఞం అట్టహాసంగా ప్రారంభమైంది. మహిళల లలిత సహస్ర నామాల పారాయణంతో ప్రాంగణం ధ్వనించింది. అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటుగా జరిగే ఈ మహాయజ్ఞం ఫిబ్రవరి రెండో తేదీన పూర్ణాహుతితో ముగుస్తుంది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి హాజరవుతారని నిర్వాహకులు తెలియజేశారు. అందుకు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, గౌరవ అతిథిగా బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక లు హాజరయ్యారు. వేల సంఖ్యలొ మహిళలు పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మిట్స్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బాలు పండ మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఇలాంటి తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తన మనసులో ఉండేదని అందుకు బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు, ఆధ్యాత్మిక వేత్త చైతన్య రాంజీలు తనకు ఎంతగానో సహకరించారని అన్నారు. అంతకు ముందు యాల్ల కొండబాబు, చైతన్య రాంజీ, బాలు పండ అతిథులు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విశ్వశాంతి దేవ మహాయజ్ఞం


